నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రెండు జాబ్ నోటిఫికేషన్లు విడుదల
రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రెండు జాబ్ నోటిఫికేషన్లు విడుదల
రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరోగ్య శాఖలో మరో 2 జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైంది. స్పీచ్ పాథాలజిస్టు పోస్టులకు జులై 12వ తేదీ నుంచి, డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌కు జులై 14వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపింది.
ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం విడుదల చేసింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 ఉండగా, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకూ.. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.
మరో 6 వేలకు పైగా పోస్టులకు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ
కాగా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడచిన 17 నెలల్లో 8 వేలకు పైగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. వీరిలో డాక్టర్స్, స్టాఫ్ నర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తదితర పోస్టులు ఉన్న విషయం తెలిసిందే. మరో 6 వేలకు పైగా పోస్టుల భర్తీ ప్రభుత్వం చేపట్టనుంది. ఈ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో భర్తీ చేయనున్న పోస్టుల్లో ల్యాబ్ టెక్నీషియన్ 1284, మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్, 1930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్) 2322, తదితర పోస్టులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.