జగిత్యాల మున్సిపాలిటీలో టిక్కెట్ల కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కేటాయింపుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ టిక్కెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన 30 మందికి టిక్కెట్లు ఇచ్చారని, తన వర్గానికి చెందిన 20 మందికి మాత్రమే ఇచ్చారని, తన మెడ కోసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ నిర్ణయాలు తనను తీవ్రంగా కలిచివేశాయని ఆయన అన్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని వాపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర అగ్రనాయకత్వం ఎమ్మెల్యేకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జీవన్ రెడ్డి, ఆయన వర్గం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. `