కేసీఆర్‌కు జీవన్ రెడ్డి సవాల్
కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని
By Medi Samrat Published on 2 Sept 2023 2:08 PM ISTకాంగ్రెస్ దళిత డిక్లరేషన్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దళిత సంక్షేమం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే అని వివరించారు. కేసీఆర్ సర్కార్ దళితులకు ఎన్ని ఇల్లు కట్టారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్ళో మేము ఓట్లు అడుగుతాం.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉన్న ఊళ్ళో కేసీఆర్ ఓటు అడగాలని సవాల్ విసిరారు.
దళితులకు భూములు పంచిన చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలదే అని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేశారా అని ప్రశ్నించారు. దళిత బంధుకు అర్హులైన లబ్ది దారులకు నిధులు అందించలేని అసమర్థత మీది.. దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తారో ప్రభుత్వం ఇప్పటి వరకూ చెప్పలేదన్నారు.
గత మూడేళ్లలో ఎంతమందికి దళిత, బీసీ, మైనార్టీ బంధులు ఇచ్చారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. కేసీఆర్ పాలన మొదటి 4 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం కోసం జరిగిందని.. ఆఖరు సంవత్సరం ప్రజల కోసమంటూ ఎన్నికల ముందు హడావిడి జరిగిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. దళితులకు పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదు.. మేము పెంచుతాం అంటే అందుకు అంత ఉలిక్కిపాటు అని మండిపడ్డారు. కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ పై విమర్శలు కాదు .. ఎస్సీ సంక్షేమంలో జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ను ప్రశ్నించు అని సూచించారు.