రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల గడువు ఇవాళే ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చలాన్లు చెల్లించని వారు వెంటనే చెల్లించాలంటూ పోలీసు ఉన్నతాధికారులు వాహనదారులకు సూచిస్తున్నారు. మరోసారి గడువు పొడిగించేది లేదని ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంకా పెండింగ్ చలాన్లు ఉన్నవారు చెల్లించాల్సిందిగా పోలీసులు సూచించారు. కాగా గతేడాది డిసెంబర్ 27 నుంచి రాయితీ పెండింగ్ చలాన్లను ప్రభుత్వం స్వీకరిస్తోంది. డిస్కౌంట్ ప్రకటించే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3.59 లక్షల చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి.
మొదట 15 రోజులు మాత్రమే పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం.. సాంకేతిక సమస్యల కారణంగా దాన్ని ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ అర్థరాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.53 కోట్ల చలాన్లు క్లియర్ అయ్యాయి. ప్రభుత్వానికి 136 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. బైక్, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ రాయితీ ప్రకటనతో వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా ఆదాయం సమకూరింది.