తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్ష మరికాసేపట్లో ముగియనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలని.. సంఘీభావం తెలిపిన పార్టీలు, ప్రజాసంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అనేక సమస్యలను పరిష్కరించి.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందని జానారెడ్డి వ్యాఖ్యానించారు.
ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్.. అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్.. సమస్యలను పరిష్కరించడంలో మోదీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని జానారెడ్డి విమర్శించారు. ప్రజలు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నామని.. అప్పటి వరకు ప్రజల గోసను ప్రభుత్వానికి విన్నవిస్తామని జానారెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నేపాన్ని నెడుతూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు. ప్రజలు రెండు పార్టీలను పక్కకు పెడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని వరి దీక్ష వేదికగా సూచించారు.