కోర్టు తీర్పు నేపథ్యంలో తనను ఎమ్మెల్యేగా గుర్తించండని జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. వనమా ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పు ప్రతులను బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా జలగం వెంకట్రావు మాట్లాడుతూ.. తనను కొత్తగూడెం ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరగా.. అసెంబ్లీ కార్యదర్శి ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. వనమా వెంకటేశ్వరరావుపై 2019లో హై కోర్టులో పిటీషన్ వేసినట్లు జలగం వెంకట్రావు పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చిందని.. నన్ను ఎమ్మెల్యేగా పరిగణించిందని వెల్లడించారు. వనమా వెంకటేశ్వర రావును ఎమ్మెల్యే పదవి నుంచి కోర్టు డిస్ క్వాలిఫై చేసిందని వివరించారు. నాది నైతిక విజయమని జలగం వెంకట్రావు పేర్కొన్నారు.
తీర్పును అమలు చేయాలని సెక్రటరీని కలిశానని తెలిపారు. స్పీకర్ తో ఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడించారు. 2018 ఎన్నికల్లో కుతంత్రాలు అన్ని చూశానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చానని.. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని స్పష్టం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్‌ను కూడా కలుస్తానని జలగం వెంకట్రావు వెల్లడించారు. ఎమ్మెల్యేగా మూడు నెలల్లో కొత్తగూడెంకు ఏం చేయాలో నాకు ఎజెండా ఉందని వెంకట్రావు తెలిపారు. మరోవైపు హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే వనమా.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.