జైరాం రమేష్‌ తమ వైఫల్యాలపై దృష్టి పెట్టాలి..కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు

By Knakam Karthik
Published on : 9 Sept 2025 1:12 PM IST

Telangana, Ktr, Congress Leader Jairam Ramesh, Politics, Vice Presidential Election

జైరాం రమేష్‌ తమ వైఫల్యాలపై దృష్టి పెట్టాలి..కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

దేశ రాజకీయాలు కేవలం రెండు పార్టీలకే పరిమితం అన్నట్లుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీకి గల నిరంతర వైఫల్యాలకు ప్రధాన కారణం ఇదేనని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ‘మాకు మద్దతివ్వకపోతే మీరు బీజేపీ పక్షాన ఉన్నట్లే’ అనే అహంకారపూరిత వైఖరి దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ను ఒంటరిని చేసిందని ఆయన ఘాటుగా విమర్శించారు.

వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీల వైఖరిపై జైరాం రమేష్‌ చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ ఘాటుగా బదులిచ్చారు. దేశం ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు రెండు ముక్కల దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. ‘జైరాం గారు, ఇలాంటి అహంకారమే మీ పార్టీని జాతీయ రాజకీయాల్లో విఫలం చేసింది. ‘మాతో ఉంటేనే మిత్రులు, లేదంటే వాళ్ల వైపు ఉన్నట్లే’ అనే వాదన అసమర్థనీయం’ అని కేటీఆర్‌ సూటిగా చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పటికీ కాంగ్రెస్‌కు ‘బీ-టీమ్‌’ కాదని, బీజేపీకి కూడా ‘బీ-టీమ్‌’ కాదని తేల్చి చెప్పారు. తాము తెలంగాణ ప్రజల ‘ఏ-టీమ్‌’ అని గట్టిగా ఉద్ఘాటించారు.

ప్రాంతీయ పార్టీలను రాజకీయ ఆటల్లోకి లాగే బదులు, తమ పార్టీ ఎదుర్కొంటున్న వైఫల్యాలపై దృష్టి పెట్టాలని కేటీఆర్‌ జైరాం రమేష్‌కు హితవు పలికారు. భారతదేశ రాజకీయాలు కేవలం కాంగ్రెస్‌, బీజేపీల మధ్యనే నడుస్తున్నట్లుగా భావించడం వారి వైఫల్యాలకు మరో ఉదాహరణ అని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాధాన్యతలు తెలంగాణ ప్రజలకు కోసమే అన్న కేటీఆర్, తెలంగాణ ప్రజల శ్రేయస్సు, ఆకాంక్షలు, వారి గొంతుకగా ఢిల్లీలో నిలబడటమే తమ లక్ష్యమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. దిల్లీలోని రాజకీయాల ఆటల్లో తాము భాగస్వాములం కాదని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు విమర్శలు చేయడం మానుకుని, తమ పార్టీ పాలనాపరమైన, ఎన్నికల వైఫల్యాలపై కాంగ్రెస్‌ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని కేటీఆర్‌ సూచించారు.

Next Story