జైపూర్ ఎక్స్‌ప్రెస్ కాల్పుల ఘ‌ట‌న‌.. మ‌ర‌ణించిన వ్య‌క్తి భార్య‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం

Jaipur Express firing incident Wife of deceased man gets govt job. తెలంగాణ శాస‌నస‌భ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి.

By Medi Samrat  Published on  4 Aug 2023 6:55 PM IST
జైపూర్ ఎక్స్‌ప్రెస్ కాల్పుల ఘ‌ట‌న‌.. మ‌ర‌ణించిన వ్య‌క్తి భార్య‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం

తెలంగాణ శాస‌నస‌భ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. స‌భ‌లో ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. జైపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ ఫైరింగ్ ఘటనను లేవ‌నెత్తారు. ఆర్ఫీఎఫ్‌ కానిస్టేబుల్ చేతన్‌సింగ్ జ‌రిపిన‌ కాల్పుల‌లో మ‌ర‌ణించిన సయ్యద్ సైఫుల్లా సంఘటనను వివ‌రిస్తూ.. హైదరాబాద్‌లో నివసించే మరణించిన సైఫుల్లా కుటుంబానికి సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

ఒవైసీ అభ్యర్థన‌పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కాల్పుల‌ ఘటనను ఖండించారు. సైఫుల్లా భార్య‌కు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు.. డ‌బుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేస్తామ‌ని ప్రకటించారు. సైఫుల్లా కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ త‌రుపున కూడా ఆర్థిక సహాయం అందజేస్తామ‌ని పేర్కొన్నారు.

నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. వారిలో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణీకులు ఉన్నారు. తెల్లవారు జామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపింది ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ చేతన్ సింగ్ గా గుర్తించారు. అతడు ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. కానిస్టేబుల్ మానసిక ఒత్తిడిలో ఉన్న‌ట్లు గుర్తించారు.

Next Story