ఎస్‌ఐ, పీసీ అభ్యర్థులకు జగిత్యాల పోలీసులు ఉచిత కోచింగ్‌

Jagtial police to give free coaching to SI, PC aspirants. ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి తీవ్ర పోటీ నెలకొనడంతో వాటికి సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రైవేట్‌ కోచింగ్‌

By Medi Samrat  Published on  20 March 2022 1:30 PM GMT
ఎస్‌ఐ, పీసీ అభ్యర్థులకు జగిత్యాల పోలీసులు ఉచిత కోచింగ్‌

ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి తీవ్ర పోటీ నెలకొనడంతో వాటికి సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో భారీ మొత్తంలో కోచింగ్‌లు తీసుకుంటున్నారు. కోచింగ్ కు ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులను ఆదుకునేందుకు.. సబ్ ఇన్‌స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న పేద, అర్హులైన యువతకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని జ‌గిత్యాల‌ జిల్లా పోలీసు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం స్థానిక‌ ఎస్‌కెఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో పోలీసు జాబ్‌ అభ్యర్థులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఉచిత కోచింగ్ కోసం 1,682 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 262 మంది మహిళలు సహా 1,000 మంది అభ్యర్థులు స్క్రీనింగ్ పరీక్షకు హాజరయ్యారు. అర్హత సాధించిన అభ్యర్థులకు జగిత్యాల, మెట్‌పల్లి పట్టణాల్లో నిపుణులైన శిక్షకులను నియమించి ఇండోర్‌, అవుట్‌డోర్‌లో శిక్షణ ఇస్తారు.

స్క్రీనింగ్ టెస్ట్ ను ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. యువత నిబద్ధత, అంకితభావంతో ఉద్యోగాలకు సిద్ధమైతే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. చదువుకు, ఉద్యోగానికి పేదరికం అడ్డంకి కాకూడదని, పేదరికాన్ని అధిగమించి ఎంతో మంది ఉన్నత స్థానాలు సాధించారని అన్నారు. పోలీసు శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నాయని, విద్యావంతులైన యువత సమయాన్ని వృథా చేయకుండా అంకితభావంతో సన్నద్ధమై ఉద్యోగాలు సాధించాలని సూచించారు. యువత నిబద్ధతతో కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇస్తే మధ్య దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని విద్యార్థులను హెచ్చరించారు. అలాంటి వారు ఎవరైనా తమ వద్దకు వస్తే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. డీఎస్పీలు ప్రకాష్, రవీందర్ రెడ్డి, సీఐలు కిషోర్, కృష్ణ, ఆర్‌ఐలు నవీన్, వామనమూర్తి తదితరులు స్క్రీనింగ్ పరీక్ష విధానాన్ని పరిశీలించారు.













Next Story