లాబీయింగ్ చేసి పీసీసీ అవొచ్చు.. కోవర్టులు ఎవ‌రో అధిష్టానం గుర్తించాలి : అధినేత్రి సోనియాకు జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న లేఖ‌..

Jaggareddy Letter to Sonia Gandhi. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శ‌నివారం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ , రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

By Medi Samrat  Published on  19 Feb 2022 12:21 PM GMT
లాబీయింగ్ చేసి పీసీసీ అవొచ్చు.. కోవర్టులు ఎవ‌రో అధిష్టానం గుర్తించాలి : అధినేత్రి సోనియాకు జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న లేఖ‌..

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శ‌నివారం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ , రాహుల్ గాంధీకి లేఖ రాశారు. మూడు పేజీల లేఖను విడుదల చేసిన జగ్గారెడ్డి.. పార్టీ వీడినా గాంధీ కుటుంబంపై గౌరవంతో ఉంటాన‌ని తెలిపారు. ఈ ప్రకటన విడుదల చేసిన నాటి నుండి నేను కాంగ్రెస్ గుంపులో ఉండనని పేర్కొన్న జ‌గ్గారెడ్డి.. త్వరలో పార్టీ పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాన‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్‌లోకి సడన్‌గా వచ్చి లాబీయింగ్ చేసి పీసీసీ కావొచ్చని.. సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ కోవర్టుగా ముద్రవేస్తున్నారని పేర్కొన్నారు.

పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీలో గతంలో వివాదాలు ఉన్నా హుందాగా ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదని అన్నారు. కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో ఉండి స్వతంత్రంగా సేవ చేస్తాన‌ని తెలిపారు. పార్టీలో ఎవ‌రు కోవర్టులో అధిష్టానం గుర్తించాలని కోరిన జ‌గ్గారెడ్డి.. 2017లో అధినేత రాహుల్ గాంధీ సభ పెట్టమంటే ఎవ్వరు సభ పెట్టడానికి ముందుకు రాకుంటే.. నేను సొంత ఖ‌ర్చుల‌తో సభ నిర్వహించానని తెలిపారు. ఆ సభ నుండి పార్టీ రాష్ట్రంలో బలపడిందని.. పార్టీ కోసం కష్టపడన‌ నేనా కోవర్టుని.. సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతలా కోవర్టులు..? అని ప్ర‌శ్నించారు.

ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుండి ఎవ్వరూ అభ్యర్థులు పేట్టకుంటే.. తాను మెదక్ జిల్లా నుండి అభ్య‌ర్ధిని పెట్టి.. కోట్లు ఖర్చుచేసి పార్టీకి ఒక్క ఓటు తగ్గకుండా పార్టీ పరువు నిలిపానని.. పార్టీ సీనియర్లు ఎవ్వరూ కనీసం అభ్యర్థిని పెట్టకుండా మౌనంగా ఉన్నారని.. ఎవరు కోవర్టులు...అభ్య‌ర్ధిని పెట్టినవాళ్లా? లేక పెట్టని వాళ్ళ..? అని లేఖ‌లో ప్ర‌శ్నించారు.

ఇటీవల హుజూరబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్లను.. మూడు వేల ఓట్లకు పరిమితం చేసిన వాళ్ళు కోవర్టులా.? నేనా.. అని అడిగారు. గాంధీ కుటుంబం పై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండించింది నేను.. మరి పార్టీలో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఎందుకు స్పందించకుండా మౌనంగా ఉన్నారు.. వారు కోవర్టులా .? లేక నేనా.. అధిష్టానం గుర్తించాలని జ‌గ్గారెడ్డి లేఖ‌లో కోరారు.


Next Story