మెదక్ జిల్లా కలెక్టర్‌పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో తమ గురించి దుష్ప్రచారం చేసిన కలెక్టర్‌పై కేసు పెడతామని ఈటల జమున హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకొని ఆయన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాలోని 81, 130 సర్వే నంబర్‌లలో తమకు 8.30 ఎకరాల భూమి ఉందన్నారు. అయితే ఈ రెండు సర్వే నెంబర్లలో 70 ఎకరాల భూమిని తాము ఆక్రమించుకున్నామని కలెక్టర్ చెప్పడం విడ్డూరంగా ఉందని, ఆయన ప్రెస్‌మీట్ పెట్టడం సరికాదన్నారు. సేకరించిన సమాచారాన్ని కోర్టుకు, తమకు ఇవ్వాల్సిన అవసరం ఉందని, కలెక్టర్ తమను బద్నాం చేయాలని చూశారని మండిపడ్డారు.
భూమి లేకున్నా, ఆక్రమించుకున్నారని మాట్లాడినందుకు కలెక్టర్‌పై కేసు పెడతామన్నారు. ఓ కలెక్టర్ టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అన్నారు. అయితే ఈ కలెక్టర్‌కు మినిస్టర్ పదవి ఆఫర్ చేశారేమో అందుకే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈటల జమున ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిలా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నామని చెబుతూ.. మహిళనైన తనను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. రామారావు అనే వ్యక్తి దగ్గర 8.30 ఎకరాల భూమి కొన్నామని, అప్పుడు ప్రభుత్వ భూమి కాదని రిజిస్ట్రేషన్ చేశారని అన్నారు. ఇప్పుడు అదే భూమి.. ప్రభుత్వ భూమి అంటున్నారని ఈటల జమున విమర్శించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే సర్కార్ భూమి ప్రైవేటుగా మారుతుందని, వ్యతిరేకంగా ఉంటే ప్రైవేటు భూమి సర్కారు భూమిగా మారుతుందని ఎద్దేవా చేశారు.