టాలీవుడ్ నిర్మాతల ఇళ్లపై మూడో రోజూ ఐటీ సోదాలు.. తనిఖీలు ఎవరెవరి ఇంట్లో అంటే?
హైదరాబాద్‌లో వరుసగా మూడో రోజూ టాలీవుడ్ ప్రొడ్యూసర్ల నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
By Knakam Karthik Published on 23 Jan 2025 9:54 AM ISTటాలీవుడ్ నిర్మాతల ఇళ్లపై మూడో రోజూ ఐటీ సోదాలు.. తనిఖీలు ఎవరెవరి ఇంట్లో అంటే?
హైదరాబాద్‌లో వరుసగా మూడో రోజూ టాలీవుడ్ ప్రొడ్యూసర్ల నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు సినీ సంస్థలకు ఫైనాన్స్ చేస్తున్న వారి ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. నిర్మాతలు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, డైరెక్టర్ సుకుమార్, మ్యాంగో అధినేత రామ్, ప్రముఖ సినీ ఫైనాన్షియర్లకు చెందిన ఇళ్లల్లోనూ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని దాదాపు 15 మంది నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినీ నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలు, స్థిర చర ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
సోమవార ఉదయం ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లోనూ అధికారులు ఏక కాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రోజు కూడా దిల్ రాజు, మైత్రీస్ మూవీస్ నిర్వాహకులు ఎర్నేని నవీన్, యలమంచిలి రవి శంకర్ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఇక పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ మూవీలకు సంబంధించిన నిర్మాత ఇళ్లల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఐటీ దాడులపై సినీ నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ... తానొక్కడిపైనే ఐటీ సోదాలు జరగడంలేదని, ఇండస్ట్రీ మొత్తం సోదాలు కొనసాగుతున్నాయని బుధవారం మీడియాకు చెప్పారు. కాగా సోదాల్లో భాగంగా దిల్ రాజ్ సతీమణిని ఐటీ అధికారులు ఇప్పటికే బ్యాంకుకు తీసుకువెళ్లి బ్యాంకు లాకర్స్ తనిఖీ చేశారు.