బీఆర్‌ఎస్ నేతలపై ఐటీ దాడులు జరగడానికి కారణమేమిటి?

ఆదాయపు పన్ను అధికారులు బీఆర్ఎస్ నేతలపై ఇళ్ళు, ఆఫీసులు, షాపింగ్ మాల్స్ పై దాడులు జరపడం హాట్ టాపిక్ గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2023 4:53 PM IST
IT Rides, Telangana, BRS, MP Prabhakar Reddy, MLA Janardhan Reddy, Shekar Reddy

బీఆర్‌ఎస్ నేతలపై ఐటీ దాడులు జరగడానికి కారణమేమిటి?

ఆదాయపు పన్ను అధికారులు బీఆర్ఎస్ నేతలపై ఇళ్ళు, ఆఫీసులు, షాపింగ్ మాల్స్ పై దాడులు జరపడం హాట్ టాపిక్ గా మారింది. పన్ను ఎగవేత ఆరోపణలపై బుధవారం, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ముగ్గురు ప్రముఖ BRS నాయకులకు సంబంధించిన ప్రాంతాలలో దాడి చేశారు. మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, భోంగిర్‌ ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిలకు చెందిన ఆస్తులపై ఐటీ శాఖకు చెందిన 50 బృందాలు సోదాలు నిర్వహించాయి. BRS నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చెన్నై బ్రదర్స్, JC బ్రదర్స్ గార్మెంట్స్ స్టోర్స్ లో సోదాలు జరిపారు. BRS భోంగీర్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వెంచర్లలో నిమగ్నమై ఉన్నారు. బీఆర్‌ఎస్‌ మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి సోనీ ట్రావెల్స్‌తో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తున్నారు.

ఈ ముగ్గురు ధనవంతులైన ఎమ్మెల్యేలు. ఆ విషయాన్ని వాళ్లే స్వయంగా అఫిడవిట్ లో పొందుపరిచారు. ఎన్నికల అఫిడవిట్‌ల ద్వారా అత్యంత ధనవంతులైన శాసనసభ్యులలో వీరు కూడా ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ముగ్గురూ 'SLS గ్రూప్' కంపెనీలో భాగస్వాములు కావడంతో పాటు, ప్రాపర్టీ డెవలపర్‌లుగా కూడా ఉన్నారు. పార్టీకి నిధులు సమకూర్చేవారిలో వీరు ముఖ్యులని కూడా చెప్పేవాళ్లు ఉన్నారు.

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మెదక్ ఎంపీలపై ఐటీ సోదాలు జరగడానికి కారణమేమిటి?

జూన్ 10, 2023న, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం రఘుమా రెడ్డి, SLS గ్రూప్, దాని ప్రమోటర్లు (BRS నాయకులు) పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. SLS ప్రాపర్టీస్‌కు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి భార్య, మేనేజింగ్ డైరెక్టర్ గా పి వనిత ఉన్నారు. రఘుమా రెడ్డి SLS ప్రాపర్టీలలో 928.829 చదరపు గజాల ప్లాట్‌లను బుక్ చేసినప్పుడు షాకింగ్ విషయాలను తెలుసుకున్నానని అంటున్నారు. “నేను జూన్ 9, 2023న నాలుగు ప్లాట్‌లను బుక్ చేసాను. ఈ వెంచర్ గురించి నేను ఆరా తీస్తే, రూ. 10.38 కోట్ల ఆస్తిని రిజిస్టర్ చేయడం కోసం కంపెనీ బ్లాక్ మనీ అడుగుతోంది తెలిసి నేను ఆశ్చర్యపోయాను. నేను రూ. 35 లక్షలు చెక్కు ద్వారా మరియు మిగిలిన నగదును చెల్లించాలని కంపెనీ పట్టుబట్టింది. వైట్ మనీని స్వీకరించడానికి సంస్థ మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేదు” అని ఆయన న్యూస్‌మీటర్‌తో అన్నారు.

హనుమా రెడ్డి చేసిన తదుపరి విచారణలో ఎస్‌ఎల్‌ఎస్ ఆస్తులు చాలా వరకూ రైతుల నుండి కొనుగోలు చేసినవే. ఎక్కువ కమీషన్‌ ఇస్తామని హామీ ఇచ్చి భూములను కొనుగోలు చేశారు. అయితే భూములిచ్చిన రైతులకు ఇంకా చెల్లింపులు జరగలేదు. “చాలా మంది కస్టమర్‌లు ఈ వెంచర్లలో ప్లాట్‌లను కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కో ప్లాట్ ధర ప్రభుత్వ నిర్ణీత విలువ కంటే 8 రెట్లు ఎక్కువ ఉంది. ఉదాహరణకు, భోంగీర్‌లోని SLS ప్రాపర్టీలలో చదరపు గజం మార్కెట్ విలువ దాదాపు రూ. 2100. అయితే, వారు దానిని రూ. 12,500కి విక్రయిస్తున్నారు. చిన్న మొత్తాన్ని చెక్కు ద్వారా.. మిగిలిన మొత్తాన్ని నగదు ద్వారా చెల్లించాలని కంపెనీ పట్టుబట్టింది. భోంగీర్ వెంచర్ 92 ఎకరాల్లో 1200 ప్లాట్లు ఉన్నాయి. ఘట్‌కేసర్‌లో దాదాపు 120 ఎకరాల్లో ఇలాంటి ప్రాజెక్టు రాబోతోంది. ఒక్కో విల్లా రూ.2.5-3 కోట్లకు అమ్ముడవుతోంది. ఇది ప్రభుత్వ విలువ కంటే చాలా ఎక్కువ” అని ఫిర్యాదుదారు చెప్పారు.

రఘుమా రెడ్డి భోంగీర్‌ స్టేషన్‌ హౌస్‌ అధికారికి ఇందుకు సంబంధించి సమాచారం అందించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. కొనుగోలుదారులకు కంపెనీ ఎలాంటి రశీదులు ఇవ్వదని, చెల్లింపునకు ఎలాంటి రుజువు లేదని అన్నారు. యాదగిరి భువనగిరి, షాద్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఇప్పటివరకు కంపెనీ 3000 నుండి 4000 ఎకరాలు విక్రయించింది.

“గత 10 సంవత్సరాలుగా, కంపెనీకి చెందిన నాయకులు రైతుల నుండి నామమాత్రపు ధరలకు భూములను కొనుగోలు చేసి, వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ వెంచర్లు వేస్తున్నారు. ఎస్‌ఎల్‌ఎస్ ప్రాపర్టీలతో కాల్ రికార్డ్‌ల రూపంలో నా దగ్గర డాక్యుమెంటరీ, ఎలక్ట్రానిక్ ఆధారాలు కూడా ఉన్నాయి, వాటిని నేను దర్యాప్తు సంస్థలకు సమర్పించాను." అని తెలిపారు. న్యూస్‌మీటర్ కు కూడా రఘుమా రెడ్డి, SLS ప్రాపర్టీస్ మధ్య కాల్ రికార్డింగ్‌లు లభించాయి. ఆ వెంచర్ పేరు 'SL ప్రకృతి శిఖర వెంచర్'. తన ఫిర్యాదుల ఆధారంగానే ఐటీ సోదాలు జరిగాయని, తన ఫిర్యాదుకు అక్నాలెడ్జ్‌మెంట్ కూడా లభించిందని రఘుమా రెడ్డి చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యేల ఆస్తులు

పైళ్ల శేఖర్ రెడ్డి తన అఫిడవిట్‌లో ఆస్తులను రూ. 91 కోట్లు ప్రకటించారు. అతను తనను తాను బిల్డర్/డెవలపర్‌గా చెప్పుకొచ్చారు. ఖమ్మంలోని SES SN మూర్తి పాలిటెక్నిక్ కళాశాల నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశానని తెలిపారు. మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి తన గత ఎన్నికల అఫిడవిట్‌లో రూ.125 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అందరికంటే ధనవంతుడు మర్రి జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే తన అఫిడవిట్‌లో రూ.161 కోట్ల ఆస్తులని ప్రకటించారు.

Next Story