గౌరవెల్లి పూర్తి చేసి నీళ్లు తీసుకువచ్చే బాధ్యత మాది: మంత్రి పొన్నం
గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు త్వరగా పూర్తిచేసి పంటలకు నీళ్లు అందిస్తాం..అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
By Knakam Karthik
గౌరవెల్లి పూర్తి చేసి నీళ్లు తీసుకువచ్చే బాధ్యత మాది: మంత్రి పొన్నం
రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పోతారం(ఎస్)లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో మొదటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. రైతులు 12 తేమ శాతంతో వడ్లు తీసుకువచ్చారు. రైతులకు విజ్ఞప్తి, పచ్చివడ్ల పేరుతో పంటల వద్దనే అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు. వడ్ల కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువస్తే మీకు మద్దతు ధర వస్తుంది. తూకంలో ఎలాంటి మోసం లేకుండా, నిధుల చెల్లింపులోనూ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం..అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకుంటున్నాం. పంట రాకపోతే కొనుగోలు కేంద్రాలు కొన్ని ఆలస్యమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులకు సంబంధించి భవిష్యత్‌లో ఇంకా అనేక ప్రయోజనాలు తీసుకువచ్చేలా నిర్ణయం తీసుకుంటాం. సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాం. వ్యవసాయ పనిముట్లు మండల సమైక్యల ద్వారా వచ్చేలా రైతులకు ఉపయోగపడేలా చేస్తున్నాం..అని మంత్రి పొన్నం తెలిపారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా కూడా రైతులు, ఉద్యోగులు, మహిళలకు సంక్షేమ పథకాలకు, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వే గ్రామాల్లో జరుగుతుంది అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఫేస్ -1, ఫేస్ -2 కింద ఇల్లు మొత్తం లేనివారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా గ్రామంలో నిర్ణయం తీసుకోవాలి. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు త్వరగా పూర్తిచేసి పంటలకు నీళ్లు అందిస్తాం. రైతులకు ఇబ్బంది అయినా అందరూ సహకరించండి. త్వరలోనే నీళ్లు తీసుకువచ్చే బాధ్యత మాది.. అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.