'ఇరానీ చాయ్ ఇరాన్ నుంచి వస్తోందా?'.. కేసీఆర్‌పై బండి సంజయ్‌ సెటైర్‌

‘Is Irani chai from Iran?’ Bandi Sanjay mocks KCR on Make In India remark. వ్యవసాయ పంపుసెట్లకు కేంద్రం బలవంతంగా కరెంటు మీటర్లు బిగిస్తున్నదని ముఖ్యమంత్రి

By అంజి  Published on  8 Dec 2022 2:03 PM GMT
ఇరానీ చాయ్ ఇరాన్ నుంచి వస్తోందా?.. కేసీఆర్‌పై బండి సంజయ్‌ సెటైర్‌

వ్యవసాయ పంపుసెట్లకు కేంద్రం బలవంతంగా కరెంటు మీటర్లు బిగిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పదే పదే చేస్తున్న ఆరోపణలను తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గురువారం తీవ్రంగా ఖండించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా మొగిలిపేట్ గ్రామంలో జరిగిన బహిరంగ ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయడం అసాధ్యమన్నారు.

''కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని నిరూపించాలని కేసీఆర్ ప్రభుత్వానికి నేను సవాలు చేస్తున్నాను. అది తప్పు అని నిరూపిస్తే.. దానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. లేని పక్షంలో కేసీఆర్ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెబుతారా?'' అని బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి 24 గంటలూ ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నారా అని కేసీఆర్‌ను బండి సంజయ్‌ ప్రశ్నించారు. నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనా? సంజయ్‌ అడిగారు.

రూ.60,000 కోట్ల మేరకు సబ్సిడీ బకాయిలు చెల్లించడంలో కేసీఆర్ విఫలమవడంతో విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని బండి సంజయ్ ఆరోపించారు. మరోవైపు విద్యుత్‌ ఛార్జీలను పెంచి సామాన్యులపై కేసీఆర్‌ పెనుభారం మోపారన్నారు. మేక్ ఇన్ ఇండియా అనేది పెద్ద ప్రహసనమని, చైనా బజార్లలో చైనా వస్తువుల అమ్మకానికి కేంద్రం అనుమతిస్తోందని కేసీఆర్ చేసిన విమర్శలపై బండి సంజయ్ స్పందిస్తూ.. చైనా బజార్‌లో చైనా వస్తువులు అమ్మితే మైసూర్ బజ్జీ, మైసూర్ పాక్ వస్తాయా ? మైసూర్ నుండి, ఇరాన్ నుండి ఇరానీ చాయ్?" అని ప్రశ్నించారు.

ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభించడం, గల్ఫ్ వలస బాధితుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు, అభివృద్ధి చెందుతున్న వేములవాడ, బాసర దేవాలయాలతోపాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సంజయ్ ఎత్తిచూపారు.

Next Story