'సీఎం సార్‌.. దయ చూపండి'.. రాజాసింగ్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on  6 Aug 2023 7:30 AM GMT
Telangana, MLA Rajasingh, Assembly, KCR

'సీఎం సార్‌.. దయ చూపండి'.. రాజాసింగ్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదని, తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందని అన్నారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. తన సొంత వారు, బయటి వారు తనను రాకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. ''ముఖ్యమంత్రి ఒక విన్నపం. నేను ఉన్నా లేకున్నా నా గోషామహల్ నియోజకవర్గ ప్రజలపై మీరు దయ చూపాలని నా ప్రార్థన'' అంటూ రాజాసింగ్‌ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం గోషామహల్ నియోజకవర్గాన్ని విస్మరించడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ధూల్‌పేట్‌లో పర్యటిస్తానని, అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పి మాట తప్పారు. అసెంబ్లీలో నేనున్నా లేకున్నా ధూల్‌పేట్‌ను అభివృద్ధి చేయాలన్నారు. 'గోషామహల్ నియోజకవర్గానికి తాను ఎంతో చేశానని చెప్పారు. నియోజకవర్గ సమస్యలు, తన పరిధిలో లేని పనులు, ప్రభుత్వం చేయాల్సిన పనుల కోసం తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి అనేక వేదికల మీద, అనేక సందర్భాల్లో, అన్ని అసెంబ్లీ సమావేశాల్లో వివరించానని ప్రస్తావించారు.

ఓ వర్గంపై అనుచితంగా మాట్లాడినందుకు ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బీజేపీకి దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత సస్పెన్షన్ ఎత్తివేస్తారని అంతా భావించినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి ముందడగు పడలేదు. అయితే.. ఈమధ్య బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావుతో రాజాసింగ్ భేటీ అవ్వడం కొత్త ఊహాగానాలకు దారితీసింది. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని రాజాసింగ్ కొట్టిపారేశారు. తాజాగా రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Next Story