తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మొదటి రోజు ఫస్ట్ ఇయర్, 29న సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 14వరకు జనరల్, 16వ తేదీ వరకు ఒకేషనల్ కోర్సుల వారికి ఉంటాయి. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని ఇప్పటికే అధికారులు తెలిపారు. విద్యార్థులు గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిది.
ముఖ్యంగా మొదటి సంవత్సరం విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, హాల్ టికెట్ మినహా ఎలాంటి పేపర్లు తీసుకెళ్లడానికి వీలు లేదు. హైపవర్ కమిటీ, జిల్లా పరీక్షల కమిటీ, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. విద్యార్థుల వద్ద ఎలాంటి చిట్టీలు లభించినా, మాస్ కాపీయింగ్‌కు పాల్పడినా డీబార్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.