తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ రాజకీయ ఆరంగేట్రం చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల రాజకీయంగా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలుపుతూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. షర్మిల దూకుడు పెంచుతున్న వేళ పార్టీకి కీలక మహిళా నేత ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేసి షర్మిలకు షాక్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న షర్మిల పార్టీకి ఆదిలోనే పార్టీ పట్ల పార్టీ నేత నుండి విముఖత వ్యక్తమైంది. పార్టీలో కీలకంగా ఉన్న మహిళా నేత రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్పడంతో.. తెలంగాణలో షర్మిల పార్టీ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం అన్ని జిల్లాలలో పార్టీని బలోపేతం చేయాలని కసరత్తు చేస్తున్న షర్మిలకు.. తాజా పరిణామం కాస్త ఇబ్బందికర పరిణామమే చెప్పాలి.