పాల్వంచలో కమలా హ్యారిస్ కోసం యాగం.. త్వరలో విగ్రహావిష్కరణ కూడా!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ డోనాల్డ్ ట్రంప్ మీద పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 1 Nov 2024 3:30 PM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ డోనాల్డ్ ట్రంప్ మీద పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు భారతదేశంలో మూలాలు ఉండడంతో ఆమె విజయాన్ని కాంక్షిస్తూ పాల్వంచలో శ్రీరాజ శ్యామలాంబ సుదర్శన మహాయజ్ఞం నిర్వహించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ పేరుతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ మహాయజ్ఞం నిర్వహించారు. యజ్ఞం ముగింపును 40 మంది వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణాహుతి వేడుకను ఘనంగా నిర్వహించామని, అన్నదాన కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. త్వరలో కమలా హారిస్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తామన్నారు.
బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడులను కమలా హ్యారిస్ పట్టించుకోలేదంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా దుయ్యబట్టారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న హింసను ఖండించారు డొనాల్డ్ ట్రంప్. కమలా హ్యారిస్, జో బిడెన్ ప్రపంచవ్యాప్తంగానూ, అమెరికాలో ఉన్న హిందువులను విస్మరించారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై దాడులు, దోపిడీలు జరుగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాను ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఎప్పుడూ, ఇలాంటివి జరగలేదని.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా, ప్రెసిడెంట్ జో బిడెన్లు చోద్యం చూస్తూ ఉన్నారన్నారు. అధికారం లోకి రాగానే అమెరికాను మళ్లీ బలపరుస్తామని, శాంతిని తిరిగి తీసుకువస్తామని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.