పౌర సరఫరాల ద్వార చిరుధాన్యాలకు చోటు కల్పించండి - మంత్రి నిరంజన్ రెడ్డి
Indian Institute of Millet Research. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
By Nellutla Kavitha Published on 23 Sep 2022 12:42 PM GMT2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిరుదాన్యాల వాడకం పెంచాలని ఐరాస 2015 సదస్సు ద్వారా ప్రపంచ దేశాల ముందు ఉంచిన 17 అంశాలలో ఇది 17వ అంశం. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై హెచ్ఐసీసీలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమయింది. ముఖ్య అతిథి గా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు ఉపాధి, ఆహారం ఇచ్చే రంగమయిన వ్యవసాయంలో, ఉత్పత్తులు సమకాలీన పరిస్థితులు, ప్రపంచపు ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తులు పెంచేలా రైతాంగాన్ని నడిపించాల్సి ఉంటుందని అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం స్థిరపడిందని, బలపడడమే కాకుండా రికార్డు స్థాయిలో పంటలు కూడా ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రపంచ వ్యాపితంగా ఉన్న ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని మన దేశంలో పంటల సాగును చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
గతంలో చిరు ధాన్యాలకు తెలంగాణ ప్రసిద్ది చెందినా కాలక్రమంలో అది తగ్గిందని, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని మంత్రి పిలుపునిచ్చారు. చిరుధాన్యాల విస్తరణ పెంచడం ద్వారా భవిష్యత్ లో ప్రపంచ మార్కెట్ ను భారత్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిరుధాన్యాల మీద ఆధారపడే ఉప ఉత్పత్తులు రోజురోజుకు విశేషమైన ఆదరణ చూరగొంటున్నాయని, అన్ని సమయాలలో తినగలిగేలా చిరుధాన్యాల నుండి తయారు చేసే ప్రాసెసింగ్ యూనిట్లు దేశంలో ప్రారంభమయ్యాయని నిరంజన్ రెడ్డి అన్నారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా చిరుధాన్యాల సాగును పెంచాలని, సాగు విస్తీర్ణం పెరగాలంటే పరిశోధనా సంస్థలు ఆ ధాన్యాల ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉన్నదని మంత్రి అన్నారు.
రైతాంగం చిరుధాన్యాల సాగు వైపు మళ్లాలంటే మిగతా పంటల మాదిరిగా మద్దతుధరను ప్రకటించి మొత్తం కొనుగోలు చేసేలా కేంద్రం రైతాంగాన్ని ప్రోత్సహించాలని కేంద్రానికి సూచించారు మంత్రి. చిరుధాన్యాల సాగులో ఉన్న ఇబ్బందులు, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చ జరగాలని, పౌరసరఫరాల శాఖ ద్వారా బియ్యం, చక్కెర ఇస్తున్నట్లే చిరుధాన్యాలకు చోటు కల్పించేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నిరంజన్ రెడ్డి సూచించారు.
దేశంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్న పలు సంస్థలు, శాస్త్రవేత్తలు, అధికారులకు అవార్డులును అందచేసారు. ఐసీడీఎస్ ద్వారా చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి అవార్డును అందచేసారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై హెచ్ఐసీసీలో ప్రారంభమయిన రెండు రోజుల జాతీయసదస్సులో వివిధ రాష్ట్రాలకు చెందిన 80 స్టాల్స్ లో మిల్లెట్స్ ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచారు. చిరుధాన్యాలతో తయారయ్యే వివిధ రకాల ఉత్పత్తులతో పాటుగా మనకు అందుబాటులో ఉన్న మిల్లెట్స్ గురించి ఉత్పత్తిదారులు ఇందులో వివరిస్తున్నారు.