స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశం ప్రగతిలో ఎంతో ముందుకు వచ్చిందని, గత 75 ఏళ్లలో వివిధ రంగాల్లో అనేక దేశాలకు ఆదర్శంగా నిలిచిందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపు మేరకు.. మంగళవారం కరీంనగర్‌లోని 33వ డివిజన్‌లో ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపా రాణి, కమిషనర్ సేవా ఇస్లావత్ తదితరులతో కలిసి కమలాకర్ ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. వేడుకల్లో భాగంగా జిల్లాలోని 38,754 ఇళ్లకు జాతీయ జెండాల పంపిణీతో పాటు తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరాలు, శారీరక వికలాంగులకు, వృద్ధులకు పండ్ల పంపిణీ వంటి అనేక ఇతర కార్యక్రమాలు చేపట్టారు. పక్షం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.