Karimnagar : ఇండిపెండెంట్‌ మ‌హిళా అభ్యర్థిని డిపాజిట్ ఎలా చెల్లించిందో తెలుసా.?

కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసేందుకు బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన ఓ మహిళ

By Medi Samrat  Published on  25 April 2024 1:27 AM GMT
Karimnagar : ఇండిపెండెంట్‌ మ‌హిళా అభ్యర్థిని డిపాజిట్ ఎలా చెల్లించిందో తెలుసా.?

కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసేందుకు బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన ఓ మహిళ పది రూపాయల నాణేల‌తో డిపాజిట్ మొత్తాన్ని చెల్లించింది. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నిమిత్తం రూ.25,000 సెక్యూరిటీ డిపాజిట్‌ చేసింది.

26 ఏళ్ల పేరాల మానస రెడ్డి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆమె వినూత్నమైన తక్కువ-ధర గృహాల డిజైన్‌లు "ఒపాడ్స్" రూపొందించి ప్రసిద్ధి చెందారు. ఆమె గృహనిర్మాణం కాన్సెప్ట్ ద్వారా త‌క్కువ ధరలో కేవ‌లం రోజుల‌లోనే ఇంటిని క‌ట్టుకోవ‌చ్చు. ఆమె రూపొందించిన గృహాలను 40 నుండి 120 చదరపు గజాల మధ్య ఎక్కడైనా నిర్మించవచ్చు, ఒక్కో యూనిట్‌కు రూ. 3.5 నుండి రూ. 5.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అన్ని వసతులతో 15-20 రోజుల్లో ఇల్లు కట్టుకోవచ్చు. తలపై నాణేల బుట్టను పట్టుకుని మానస రెడ్డి కలెక్టరేట్‌కు రావడం అక్కడ ఉన్న పోలీసుల‌ దృష్టిని ఆకర్షించింది. తనిఖీ తర్వాత.. ఆమె నామినేషన్ దాఖలు ప్రక్రియను కొనసాగించడానికి అనుమతించారు పోలీసులు.

కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బ‌రిలోకి దిగుతున్న‌ట్లు మానస రెడ్డి తెలిపారు. నియోజకవర్గ ప్ర‌జ‌ల‌కు ఉచిత విద్య, వైద్యం, సేంద్రియ ఎరువులు వంటి కార్యక్రమాలను చేర‌వేర్చుతాన‌ని వాగ్దానం చేసింది. రైతులు తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించే అధికారం కల్పిస్తాన‌ని ఆమె హామీ ఇచ్చారు.

“నా పేరు మానస రెడ్డి, నేను కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశీస్సులతో నా ఎజెండాను ముందుకు తెస్తున్నాను. నా నియోజకవర్గానికి ఉచిత విద్య, వైద్యం, సేంద్రీయ ఎరువులు అందించడానికి నేను కృషి చేస్తాను.. అలాగే రైతులు వారి ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారం ఇస్తాను, ”అని ఆమె చెప్పారు.

ఆటోడ్రైవర్లకు నెలకు రూ.2000 గౌరవ వేతనం, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సహాయం, కరీంనగర్ ఎంపీగా ఎన్నికైతే ఎంపీ నిధులతో 200 గ్రామాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందించేందుకు కృషిచేస్తాన‌ని హామీ ఇచ్చారు. రూ 1 నాణేలన్నీ వ్యక్తులు విరాళంగా ఇచ్చారా అనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ.. ఆమె అభ్యర్థిత్వానికి నిధులు సమకూర్చడంలో మానస రెడ్డి సాంప్రదాయేతర విధానం అంద‌రి దృష్టిని ఆకర్షించింది.


Next Story