తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం.. ప్రజలకు బిగ్ అలర్ట్
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
By - అంజి |
తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం.. ప్రజలకు బిగ్ అలర్ట్
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్, జోగులాంబ గద్వాల, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి రోజూవారీ పనులకు ఆటంకం ఏర్పడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం బెగ్లూర్‌లో విషాదం జరిగింది. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షం ధాటికి గోడ కూలి లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. గోడ కూలిన ఘటనలో లక్ష్మీ భర్త దుర్గయ్యకు గాయాలయ్యాయి.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మియాపూర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాంపల్లి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో వాన పడుతూనే ఉంది. దీంతో రోజువారీ కార్యకలాపాలు నెమ్మదించాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో శంషాబాద్‌లో ల్యాండ్ కావాల్సిన విమానాలను దారి మళ్లీస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి మార్కెట్ యార్డులో వర్షపు నీరు చేరింది. వర్షపు నీరు చేరడంతో కూరగాయల దుకాణాలు నీట మునిగాయి. వర్షం ప్రభావంతో డ్రైనేజీ పొంగి మార్కెట్‌లోకి వస్తోంది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. సింగూరు ప్రాజెక్టుకు 85 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుంటే.. ప్రాజెక్టు గేట్ల ద్వారా 90 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.
భారీవర్షాలు కురుస్తున్నందున ఐటీ ఉద్యోగులకు ఇంటి దగ్గర నుండి విధులు నిర్వహించే సౌకర్యం (వర్క్ ఫ్రమ్ హోమ్) కల్పించాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. వర్షాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందుకు తలెత్తుతున్నందున ఐటీ సంస్థలు వెంటనే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు కోరారు..
ఆగకుండా కురుస్తున్న వర్షం వల్ల హైదరబాద్ నగరంలోని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలోకి వరద నీరు చేరింది. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం హైదరాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అడపాదడపా భారీ ఉరుములు, ఈదురుగాలులు మరియు తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. రోజంతా నిరంతర వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రయాణ మరియు బహిరంగ ప్రణాళికల కోసం వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని IMD సూచించింది.