భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకుని నేటి నుంచి నవమి ఉత్సవాల పనులను ఆలయ అధికారులు ప్రారంభించారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు విశేస స్నపన తిరుమంజనం నిర్వహించారు.
శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు పవిత్ర పుణ్య జలాలను గోటి తలంబ్రాలపై చల్లారు. రోలు, రోకలిలో లక్ష్మి, సరస్వతి అమ్మవార్లను ఆవాహన చేసి రోకలికి కంకణధారణ చేశారు. తొమ్మిది మంది ముత్తయిదువలు పసుపు దంచే వేడుకను చేపట్టారు. అలా తయారు చేసిన పసుపు, కుంకుమతోపాటు ఇతర ద్రవ్యాలు కలిపి 1,108 మంది మహిళలు తలంబ్రాలను కలుపుతారు. దీంతో రామయ్య పెండ్లి పనులు మొదలైనట్టు పరిగణిస్తారు.
ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. ఏప్రిల్ 9న సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 10న సీతారాముల కల్యాణ మహోత్సవం, 11న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.