ఫ్రీ బస్.. మహిళా ప్రయాణికులకు ముఖ్య గమనిక

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మహిళలకు ఉచితం అయినప్పటికీ కచ్చితంగా టికెట్‌ తీసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

By అంజి  Published on  9 Jan 2024 7:26 AM IST
Telangana, women, traveling , TSRTC buses

ఫ్రీ బస్.. మహిళా ప్రయాణికులకు ముఖ్య గమనిక

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మహిళలకు ఉచితం అయినప్పటికీ కచ్చితంగా టికెట్‌ తీసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఉచితమే కదా.. జీరో టికెట్‌ ఎందుకు తీసుకోవాలని చాలా మంది కండక్టర్లతో గొడవ పడుతున్నారు. ఇది కరెక్ట్‌ కాదని.. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌ చేస్తుందని సజ్జనార్‌ తెలిపారు. జీరో టికెట్‌ లేకుంటే రూ.500 ఫైన్‌ వేస్తామని హెచ్చరించారు.

జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు ప్రయాణికులు నష్టం చేసిన వాళ్లవుతారని, కావున ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలని సజ్జనార్‌ కోరారు. ఒక వేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని, అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలన్నారు.

ప్రయాణ సమయంలో మహిళలు తమ ఒరిజినల్‌ గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ లు చూపిస్తున్నారని సజ్జనార్‌ అన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందన్నారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ ను తీసుకోవాలని కోరారు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story