జనవరి 26 నుంచి 4 పథకాలు అమలు.. తెలంగాణ మంత్రి కీలక ప్రకటన
జనవరి 26 నుంచి తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న నాలుగు సంక్షేమ పథకాల గురించి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
By Knakam Karthik
జనవరి 26 నుంచి 4 పథకాలు అమలు.. తెలంగాణ మంత్రి కీలక ప్రకటన
జనవరి 26 నుంచి తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న నాలుగు సంక్షేమ పథకాల గురించి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ద్వారా లద్ధి జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. రేషన్ కార్డులకు అర్హత ఉండి రాని వారు ఉంటే గ్రామ సభల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి పక్షాల మాటల మాయలో పడి.. ప్రజలు ఆందోళన చెందొద్దన్న ఆయన.. గత పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డయినా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. దేశంలోనే మొదటిసారిగా భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5-10 లక్షలకు పెంచుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రైతులకు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు. సన్న వడ్లకు రూ.500 బోనస్, గతంలో ఎప్పుడు లేని విధంగతా ధాన్యం సేకరణ చేసిన 48 గంటల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఎవరికైనా అర్హత ఉండి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు ఉంటే పూర్తి సమాచారాన్ని స్థానిక అధికారులకు ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని గ్రామ స్థాయిలోని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించి, వారికి అండగా నిలబడాలని కోరారు.