తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు: ఐఎండీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 3 Aug 2023 10:24 AM ISTతెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు: ఐఎండీ
తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 3, 4 (ఇవాళ, రేపు) తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్‌లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నగరంలో అక్కడక్కడా ఆకాశం మేఘావృతమై ఉంది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం తెలిపిన వాతావరణ శాఖ, ఆ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా పంటనష్టం జరిగింది. వేలాది కుటుంబాలు నిరాశ్రయులై రోడ్డున పడ్డాయి. ఇప్పుడు మరోసారి వర్షాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలతో తెలంగాణ జిల్లాలు అతలాకుతలమయ్యాయని నిన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరంగల్, ములుగు, భద్రాచలం, హైదరాబాద్ ప్రాంతాలను వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని రాజ్యసభ దృష్టికి తీసుకువెళ్లారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఏలూరు, అల్లూరి, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన చోట్ల చెదురుముదురుగా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.