రైతులకు తీపికబురు.. జూన్ 5లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు
భారత వాతావరణ శాఖ రైతులకు తీపికబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే ప్రవేశిస్తాయని తెలిపింది.
By అంజి
రైతులకు తీపికబురు.. జూన్ 5లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు
హైదరాబాద్: భారత వాతావరణ శాఖ రైతులకు తీపికబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే ప్రవేశిస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గతేడాది మే 30న దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. జూన్ 8న రాష్ట్రాన్ని తాకాయ. అదే ఈ ఏడాఏదేఇ మే 27నే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా వేయడంతో జూన్ 5 లోపే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది.
రాష్ట్రంలో ఇవాళ, రేపు పిడుగులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్‌లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కామారెడ్డి, ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. చందానగర్, కూకట్‌పల్లి, బాలానగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్ తదితర ప్రాంతాల్లో వర్ష బీభత్సానికి పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. నగర వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి వర్షం కొనసాగింది.