తెలంగాణలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల పిడుగులు, వడగాళ్లతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరంలో ఉదయం నుండి పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక చేసింది.