తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు: ఐఎండీ
తెలంగాణలో సెప్టెంబర్ 16 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.
By అంజి Published on 14 Sep 2023 3:43 AM GMTతెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు: ఐఎండీ
హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 16 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. వాతావరణ శాఖ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లు - చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో సెప్టెంబర్ 15 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మూడు రోజులు భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది.
అలాగే వాతావరణ ఔత్సాహికుడు, తన ఖచ్చితమైన వాతావరణ సూచనలకు ప్రసిద్ధి టీ. బాలాజీ.. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై సాయంత్రం వేళల్లో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉత్తర తెలంగాణలో రోజంతా నిరంతర వర్షాలు కురుస్తాయని ఆయన అంచనా వేశారు. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ పేర్కొన్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) నివేదిక ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా వేమన్‌పల్లిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. మండలంలో 151.3 మి.మీ వర్షపాతం నమోదైంది. నిన్న హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురిశాయి. నగరంలో ఆసిఫ్‌నగర్‌లో అత్యధికంగా అంటే 12.8 మి.మీ వర్షం కురిసింది. భారీ వర్షాల సూచన దృష్ట్యా, తెలంగాణ వాసులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం చాలా కీలకం.