బెట్టింగ్‌ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం.. సిట్‌ చీఫ్‌గా ఐజీ రమేష్‌

బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) అధిపతిగా ఐజీ ఎం.రమేష్‌ పేరు ఖరారు చేసింది.

By అంజి
Published on : 31 March 2025 8:39 AM IST

IG Ramesh, SIT, investigate, betting apps, Telangana

బెట్టింగ్‌ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం.. సిట్‌ చీఫ్‌గా ఐజీ రమేష్‌

హైదరాబాద్‌: బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) అధిపతిగా ఐజీ ఎం.రమేష్‌ పేరు ఖరారు చేసింది. ఈ మేరకు డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ ఆదివారం ఉత్తర్వులు (ఆర్సీ నెం.191/ఎల్‌ అండ్‌ ఓ–ఐ/2025) జారీ చేశారు. కాగా ఈ సిట్‌లో రమేష్‌తో పాటు ఇంటెలిజెన్స్‌ ఎస్పీ సీహెచ్‌ సింధు శర్మ, సీఐడీ ఎస్పీ కె.వెంకట లక్ష్మీ, సైబరాబాద్‌లో పని చేస్తున్న అదనపు ఎస్పీ ఎస్‌.చంద్రకాంత్, సీఐడీ డీఎస్పీ ఎం.శంకర్‌ సభ్యులుగా ఉన్నారు.

ఈ క్రమంలోనే బెట్టింగ్‌ కేసుల దర్యాప్తునకు అవసరమైన అధికారులను సిట్‌ ఎంపిక చేసుకోనుంది. దీంతో పాటు ఫైనాన్సియల్‌ నిపుణులు, లా ఆఫీసర్లు, ఆడిటర్లు, ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేషన్‌ నిపుణులు తదితరులను సీఐడీ అదనపు డీజీ అనుమతితో నియమించుకునే అవకాశం ఉంది. ఈ సిట్‌ కేవలం కేసుల్ని దర్యాప్తు చేయడం మాత్రమే కాకుండా బెట్టింగ్‌ యాప్స్‌ తీరుతెన్నులు, వ్యవహారాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వీటిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయాల్సి ఉంటుంది.

ఈ యాప్స్‌ను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ, సమాచార ప్రసార, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ, హోం మంత్రిత్వ శాఖలతో పాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ తదితరాల బాధ్యతలను సిట్‌ గుర్తించాల్సి ఉంది. ఈ యాప్స్‌ ఆర్థిక లావాదేవీలు, వాటి మార్గాలను గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దృష్టికి తీసుకువెళ్లాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న చట్టాలు, బెట్టింగ్‌ యాప్స్‌పై చర్యలకు వీటిలో అవసరమైన మార్పు చేర్పులను సిట్‌ సిఫార్సు చేయనుంది. ఇలాంటి అనేక అంశాలు, సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సిట్‌ 90 రోజుల్లో డీజీపీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం డీజీపీ కార్యాలయం కేంద్రంగానే పని చేయనుంది.

Next Story