హైదరాబాద్: ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మాటల యుద్ధంతో హైదరాబాద్‌లో నెలకొన్న హైటెన్సన్ వాతావరణంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. రెచ్చగొట్టి గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఢిల్లీ నుంచి ఆయన ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్‌లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉద్ఘాటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలి. హైదరాబాద్, తెలంగాణల్లో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తుల పట్ల జీరో టాలరెన్స్ ఉంటుందని తెలిపారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు.