తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణకు కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. గతంలో కేంద్ర పరిపాలన ట్రెబ్యునల్(క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో కొత్త సీఎస్‌ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. మధ్యాహ్నం 3.15 గంటలకు బీఆర్ కేఆర్ భవన్ లో శాంతి కుమారి సీఎస్‌గా భాద్యతలు స్వీకరించారు.
శాంతి కుమారి 1965లో జన్మించారు. 1989 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారిణి. ఉమ్మడి రాష్ట్రంలో శాంతి కుమారి బీసీ వెల్ఫేర్ కమిషనర్ గా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత శాంతి కుమారి సీఎంఓ లో కీలక పాత్ర పోషించారు. టిఎస్ఐపాస్ లో చేజింగ్ సెల్ ప్రత్యేక అధికారిగా పని చేశారు. ఆమె ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. శాంతి కుమారి నియామకంతో సీఎస్ పదవి ఎవరిని వరిస్తుందనే ఊహాగానాలకు తెరపడింది. ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, రజత్ కుమార్, రామకృష్ణారావుల పేర్లు ఆశావహుల లిస్టులో వినబడ్డాయి.