13వ ర్యాంక్ సాధించిన తెలుగ‌మ్మాయి.. టాప్-3 లో కూడా మహిళలే..

IAS 2021 results Women take top 3 spots; 31YO Priyamvada is Telangana topper. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మే 30న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

By Medi Samrat  Published on  30 May 2022 3:10 PM GMT
13వ ర్యాంక్ సాధించిన తెలుగ‌మ్మాయి.. టాప్-3 లో కూడా మహిళలే..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మే 30న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2021 తుది ఫలితాలను ప్రకటించింది. శ్రుతి శర్మ టాపర్‌గా నిలిచింది. అంకితా అగర్వాల్ రెండో స్థానంలో నిలవగా, గామిని సింగ్లా మూడో ర్యాంకులో నిలిచారు. టాప్-3 లో మహిళలే ఉండడం విశేషం.

సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2021 ఫలితాలు మార్చి 17న ప్రకటించబడ్డాయి. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ రౌండ్ (వ్యక్తిత్వ పరీక్ష) కోసం పిలుస్తారు. పర్సనాలిటీ టెస్ట్ ఏప్రిల్ 5 నుండి మే 26, 2022 వరకు జరిగింది. UPSC CSE తుది ఫలితం మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్లలో అభ్యర్థుల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఈ పరీక్ష 712 సివిల్ సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయడానికి ఉంచారు. మొత్తం 685 మందిని సివిల్ సర్వీసెస్ అపాయింట్ మెంట్ కోసం యూపీఎస్సీ సిఫారసు చేసింది. వీరిలో 244 మంది జనరల్, 73 మంది ఈడబ్ల్యూఎస్, 203 మంది ఓబీసీ, 105 మంది ఎస్సీ, 60 మంది ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు.

తెలంగాణలో, 31 ​​ఏళ్ల ప్రియంవద మద్దల్కర్ ఆల్-ఇండియా ర్యాంక్ (AIR) 13 సాధించి రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. ముంబైకి చెందిన ప్రియంవద కోచింగ్ కోసం హైదరాబాద్‌లోని సైనిక్‌పురికి వెళ్లారు. ఆమె ఐచ్ఛిక సబ్జెక్ట్ సోషియాలజీ. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొంతమంది న్యూస్ రిపోర్టర్ నాకు ఫోన్ చేసి నేను స్టేట్ టాపర్ అయ్యానని చెప్పారు. ఇదంతా డ్రీమ్ లాగా అనిపిస్తోంది. నా దృష్టి అంతా నా వంతు కృషి చేయడంపైనే ఉండేది" అని ప్రియంవద చెప్పారు. ఇది ఆమెకు రెండో ప్రయత్నం. 2020లో ఆమె తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరయ్యారు. కానీ ఆమె సరిగ్గా ప్రిపేర్ కాలేదు.

ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు :

ప్రతిరోజూ 8-9 గంటల పాటు ప్రిపేర్ అయ్యేదానినని ప్రియంవద చెప్పుకొచ్చారు. "సివిల్ సర్వీస్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే గంటల సంఖ్య కంటే, స్థిరత్వం ముఖ్యం అని నేను భావిస్తున్నాను. క్రమం తప్పకుండా అప్డేట్ అవుతూ ఉండడం.. ప్రిపరేషన్ కోసం ప్రతిరోజూ కొంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం" అని ఆమె చెప్పింది.

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వి. సంజన సింహ (ర్యాంక్ 37), హైదరాబాద్‌కు చెందిన కోపిశెట్టి కిరణ్మయి (ర్యాంక్ 56), విజయవాడకు చెందిన తిరుమణి శ్రీ పూజ (ర్యాంక్ 62), గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి (ర్యాంక్ 69) హైదరాబాద్ నుండి ఇతర టాపర్లుగా నిలిచారు.


56వ ర్యాంకు సాధించిన కిరణ్మయి వైద్యురాలు. పరీక్షలకు సిద్ధం కావడానికి ఆమె తన ఏడేళ్ల కుమార్తెకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ''పరీక్షలకు ప్రిపేర్ కావడానికి నా కూతురికి దూరంగా ఉండాల్సి వచ్చింది, అందుకు మా కూతురు నాకు గొప్ప సపోర్ట్ ఇచ్చింది.. ఇప్పుడు నేను మరింత ఎత్తుకు ఎదిగిన తర్వాత సమాజానికి నా వంతుగా సేవ చేస్తాను.. ఆ అదృష్టం నాకు దక్కింది'' అని చెప్పింది.


Next Story
Share it