నేను ఎలాంటి అవినీతి చేయలేదు.. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్‌: కేసీఆర్‌

జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించామని తెలిపారు.

By అంజి  Published on  15 Jun 2024 9:00 AM GMT
corruption, Inquiry commission, political party, KCR, Telangana

నేను ఎలాంటి అవినీతి చేయలేదు.. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్‌: కేసీఆర్‌

జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించామని తెలిపారు. కరెంట్‌ విషయంలో గణనీయమైన మార్పు చూపించామన్నారు. కానీ రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్‌ ఏర్పాటు చేశారని, తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. కమిషన్‌ చైర్మన్‌ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలు తనను బాధించాయని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

''రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్‌ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయిన పరిస్థితి. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్‌ హాలిడే ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. తెలంగాణ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. అన్ని రకాల అనుమతులు పొంది మందుకు పురోగమించడం జరిగింది. రాజకీయ కక్షతో తనను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికే కమిషన్ వేశారు‌. మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మా మార్పును తక్కువ చూపించేందుకే ప్రభుత్వ ప్రయత్నాలు'' అని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

విద్యుత్‌ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణలో ఏ మాత్రం నిష్పాక్షికత కనిపించడం లేదని మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. విచారణ అనేది పవిత్రమైన బాధ్యత, కానీ కమిషన్‌ చైర్మన్‌ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్‌ ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుందని కేసీఆర్‌ ఆరోపించారు. అందుకే తాను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని లేఖలో పేర్కొన్నారు. కమిషన్‌ చైర్మన్‌గా నరసింహారెడ్డి తప్పుకోవాలని కేసీఆర్‌ సూచించారు.

Next Story