నాకు ఫామ్‌ హౌస్‌ లేదు.. అది నా ఫ్రెండ్‌ది: కేటీఆర్‌

తన పేరుపై ఏ ఫామ్‌ హౌస్‌ లేదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలిసిన మిత్రుడి ఫామ్‌ హౌస్‌ లీజుకు తీసుకున్నానని తెలిపారు.

By అంజి  Published on  21 Aug 2024 9:15 AM GMT
farm house, KTR, Telangana

నాకు ఫామ్‌ హౌస్‌ లేదు.. అది నా ఫ్రెండ్‌ది: కేటీఆర్‌

తన పేరుపై ఏ ఫామ్‌ హౌస్‌ లేదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలిసిన మిత్రుడి ఫామ్‌ హౌస్‌ లీజుకు తీసుకున్నానని తెలిపారు. అది బఫర్‌ జోన్‌లో ఉంటే దగ్గరుండి కూలగొట్టిస్తానన్నారు. కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి, పొంగులేటి, కేవీపీ, గుత్తా, పట్నం, మధుయాష్కీలకు ఫామ్‌హౌస్‌లు ఉన్నాయన్నారు. పొంగులేటి ఫామ్‌ హౌస్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని, వాటితోనే కూల్చివేతలు ప్రారంభించండని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని అందుకు నిరసనగా రేపు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తామని కేటీఆర్‌ అన్నారు. రుణమాఫీపై దృష్టిని మరల్చేందుకు రేవంత్‌ చిల్లర భాష ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను తిడితే కొన్ని మీడియా సంస్థలు సంతోష పడుతున్నాయి.. కానీ తాము డైవర్ట్‌ కామని, రైతుల పక్షానే పోరాడతామన్నారు. ఆంక్షలు లేకుండా ఎప్పటి వరకు రుణమాఫీ చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

''అధికారంలోకి వచ్చిన రోజే రూ. 2 లక్షల రుణమాఫీ అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. ఇప్పటికైనా మేము రుణమాఫీ చేయలేకపోయాం. మా వల్ల కాలేదని చెబుతారని అనుకున్నాం. రుణమాఫీ బూటకం, పచ్చి దగా, పచ్చి మోసం. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి బండారం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బట్ట బయలైంది. వ్యవసాయ శాఖ మంత్రి ఏమో రూ. 2 లక్షలు మాఫీ చేశాం అంటూ ప్రకటన చేశారు. కానీ కొన్ని పత్రికలు రుణం పూర్తిగా మాఫీ కాలేదంటూ వార్తలు రాశాయి. జరిగింది రుణమాఫీ కాదు.. పెట్టింది రైతులకు టోపీ. ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. బ్యాంకులను ముట్టడిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. రైతులకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెప్పుకుంది. కానీ జరిగింది మోసం. రుణమాఫీ జరగలేదు'' అని కేటీఆర్‌ అన్నారు.

''మాకెందుకు రుణమాఫీ జరగలేదని రైతుల రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. రుణమాఫీ కాలేదు కనుక రాష్ట్ర వ్యాప్తంగా రణరంగంగా మారిన పరిస్థితి. అదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం లో బజార్ హత్నూర్ లో రైతుల పై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏ పార్టీ ప్రేరేపించకుండా రైతులు ఆందోళన చేస్తున్నారు. రుణమాఫీ జరగలేదని ఆందోళన చేస్తే రైతులకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడేలా కేసులు పెట్టి వేధిస్తోంది ఈ ప్రభుత్వం. రైతుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడుతోంది. రెండు లక్షల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెప్తున్నారు.కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ఇంకా రుణమాఫీ కావాల్సి ఉందంటున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులకు అసలు సయోధ్య లేదు. మనిషికి ఒక్క మాట మాట్లాడుతున్నారు. రుణమాఫీ వట్టిదే అని మంత్రుల మాటలతో తేలిపోయింది. సాంకేతిక అంశాల ఆధారంగా రుణమాఫీ జరగలేదని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సాంకేతిక కారణాలు ఏమీ లేవు. రుణమాఫీ ఎగ్గొట్టేందుకే ఇలా కారణాలు చెబుతున్నారు'' అని కేటీఆర్‌ తెలిపారు.

Next Story