ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్తున్నా: కవిత
ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్తున్నా..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు
By - Knakam Karthik |
ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్తున్నా: కవిత
హైదరాబాద్: ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్తున్నా..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారు. తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 అమరులు అయ్యారని అనేక సందర్భాల్లో చెప్పాము. అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయాము. 500 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాము. ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు, కొన్ని చోట్ల ఎంపీపీ, జెడ్పిటిసి టిక్కెట్లు వచ్చాయి. కానీ ఉద్యమకారులకు అనుకున్న మేర న్యాయం జరగలేదు, నేను మంత్రిగా లేకపోయినా ఎంపీగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అడిగాను. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేకపోయినందుకు నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నా. అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ప్రభుత్వంతో ఇప్పిస్తాం...అని కవిత వ్యాఖ్యానించారు.
నేను 33 జిల్లాలు,119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనకు బయలుదేరుతున్నా. అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలి. అందరి కోసం తెలంగాణ సాధించుకున్నాం. ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలి. అగ్రవర్ణాల్లో అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అన్ని వర్గాలు కలిసి ఉంటే తెలంగాణ బాగుంటుంది. ఆత్మ గౌరవంతో కూడిన తెలంగాణ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. జిల్లాల్లో జరగాల్సిన అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడకు వెళ్లి పోరాటం చేస్తాము. గతంలో జాగృతిలో పనిచేసిన వారికి స్వాగతం పలుకుతున్నా మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టమని కోరుతున్నా. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసివేశారు.తిరిగి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండే దాకా పోరాటం చేద్దాం. సామాజిక తెలంగాణ కోసం కలిసిరండి. కలిసి పోరాటం చేద్దాం. ఈ ప్రభుత్వంపై జంగ్ సైరన్ చేద్దాం..అని కవిత మాట్లాడారు.