టైం ఇవ్వాలనే మౌనంగా ఉన్నా.. గట్టిగా కొట్టడం నాకు అలవాటు.. కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 31 Jan 2025 4:15 PM IST
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక కామెంట్స్ చేశారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌజ్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని, కైలాసం ఆడుతుంటే పెద్దపాము మింగినట్లుగా రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైందని అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన ఎలాంటి పురోగతి లేదని దుయ్యబట్టారు.
గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయి. సంగమేశ్వర, బసవేశ్వర, కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారు. ఎన్నో ప్రభుత్వాలను చూశా.. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ వాళ్లు కనబడితే జనాలు కొట్టేలా ఉన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే కేసులతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటోందని ఆరోపించారు. ఇక లాభం లేదు.. ప్రత్యక్ష పోరాటం చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. నమ్మి ఓట్లు వేస్తే మంచి గుణపాఠం చెప్పారని తెలిపారు.
అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ వేధిస్తోందని, గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలు సంగతి పక్కనబెడితే.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా గంగలో కలిపారని విమర్శించారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా.. నేను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం నా అలవాటు. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ పెడతాం" అని కేసీఆర్ మాట్లాడారు.