బెంగళూర్ వెళ్లిన హైడ్రా బృందం.. ఎందుకంటే..?
చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూర్ వెళ్లింది
By Medi Samrat Published on 7 Nov 2024 9:49 AM GMTచెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూర్ వెళ్లింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా బృందం బెంగళూర్ పర్యటనకు వెళ్లింది. బెంగళూర్ లో హైడ్రా బృందం కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ ను సందర్శించింది. ముందస్తుగా వర్షం సమాచారం ప్రజలకు చేర్చడం.. ఎంత మొత్తం వర్షం పడబోతోంది.. వరద ముంచెత్తే ప్రాంతలవారిని అలెర్ట్ చేయడం.. ట్రాఫిక్ జామ్ అలెర్ట్.. ప్రత్యామ్నాయ రహదారులను సూచించే విధానాలపై అధ్యయనం చేయనుంది.
బెంగళూర్ మేఘసందేశం app పనిచేసే విధానం.. యీ app ద్వారా యీ ప్రాంతాల్లో ఎంత మొత్తం వర్షం పడుతోంది, వరద, ట్రాఫిక్ జామ్, వడగళ్ల వాన యిలా సమాచారం యిచ్చే విధానం.. వరద ముప్పు వున్న ప్రాంతాలను అప్రమత్తం చేయడం.. వరద కాలువలకు ఎంత మొత్తం నీరు వెళ్తోంది.. ఎక్కడ చెత్త పేరుకుపోయింది.. వివరాలను అలెర్ట్ చేసే సెన్సార్ విధానం పై అధ్యయనం చేయనుంది. 20 ఏళ్ల డేటాతో ఎన్ని సెంటి మీటర్ల వర్షం పడితే వరద ముప్పు ప్రాంతాలను అంచనా వేయడం తదితర సమాచారం తెలుసుకోనుంది. Ksndmc కేంద్రంలో వర్షపాతం నమోదు, గాలి వేగం, ఉష్ణోగ్రతల వివరాలు చెప్పే వాతావరణ కేంద్రాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా అధికారులు రీజినల్ ఫైర్ ఆఫీసర్లు వి. పాపయ్య, ఏ. జయప్రకాష్, ఏఈ నాగరాజు, ఇన్స్పెక్టర్ విజయ్ ఆదిత్య తదితరులు బెంగుళూరుకు వెళ్లారు.