గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు..ఓ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం
హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో హైడ్రా భారీగా కూల్చివేతలు చేపట్టింది
By Knakam Karthik
గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు..ఓ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం
హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో హైడ్రా భారీగా కూల్చివేతలు చేపట్టింది. మంగళవారం ఉదయం సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్‌ను, చుట్టుపక్కల నిర్మించిన కొన్ని ఫుడ్ స్టాల్స్‌ను కూడా కూల్చివేసింది. లే అవుట్ లో తమ ప్లాట్లు కనిపించకుండా, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని కొందరు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. వాటిని పరిశీలించిన హైడ్రా.. కూల్చివేత చర్యలు చేపట్టింది. సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్ లో ఉన్న కట్టడాలను హైడ్రా కూల్చివేసింది.
లే అవుట్ కనిపించకుండా రోడ్లు, పార్కులను కలుపుతూ నిర్మించిన ఆక్రమణలపై కూడా హైడ్రా కొరడా ఝుళిపించింది. రేకుల ఫెన్సింగ్, మినీహాల్, వంటగదులు, రెస్ట్ రూమ్స్ ను హైడ్రా తొలగించింది. వీటితో పాటు జీ +2గా నిర్మించిన 3 ఐరన్ షెడ్స్ ను కూడా కూల్చివేసింది. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు హైడ్రా ఫోర్స్, పోలీసులు భారీగా మోహరించారు.
కాగా.. నగరంలో ఇకపై కబ్జాలకు పాల్పడే వారిని కటకటాల్లోకి పంపేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. బుద్ధభవన్ సమీపంలో ఉన్న భవనంలో రెండంతస్తుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ను నిర్మిస్తున్నారు. ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి ఈ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో ఒక ఏసీపీ, ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, 12 మంది ఎస్సైలు, 30 మంది కానిస్టేబుళ్లతో పాటు 70కి పైగా వాహనాలు అందుబాటులో ఉండనున్నాయి. భూ కబ్జాలతో పాటు.. అక్రమ ఇసుక దందా పై కూడా హైడ్రా ఫోకస్ చేయనుంది.