కాసేపట్లో మాక్ డ్రిల్..ఎవరూ భయపడొద్దు: హైదరాబాద్ సీపీ
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు
By Knakam Karthik
కాసేపట్లో మాక్ డ్రిల్..ఎవరూ భయపడొద్దు: హైదరాబాద్ సీపీ
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో మరికాసేపట్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నాం. రెండు నిమిషాల పాటు సైరన్ మోగుతుంది. ఈ సైరన్ మోగిన వెంటనే ప్రజలు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తాం. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదు. అత్యవసర పరిస్థితి వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన విధానంపై అవగాహన కోసమే ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై ప్రజల్ని మానసికంగా సన్నద్ధం చేయడమే దీని ఉద్దేశం..అని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.
‘‘సైరన్ మోగిన వెంటనే ప్రజలు ఇళ్లల్లో ఉంటే ఇంటికే పరిమితం కావాలి. బయటకు రావొద్దు. బయట ఉన్నవారు సమీప ప్రాంతంలో ఏదైనా సెల్లార్, షెల్టర్, భవనం ఉంటే దాంట్లోకి వెళ్లాలని కోరుతున్నాం. వాహనాలపై ప్రయాణిస్తున్నవారైతే తమ వాహనాలను పార్క్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. ప్రజల్ని అప్రమత్తం చేయడానికే ఈ మాక్‌డ్రిల్. 15 నిమిషాల తర్వాత మరో మెసేజ్ ఐసీసీసీ నుంచి వెళ్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇలాంటి ఘటన జరిగిన సందర్భంలో సివిల్ డిఫెన్స్ పరంగా ప్రభుత్వ విభాగాల అప్రమత్తత ఎలా ఉందో చెక్ చేయడానికి నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగుతుంది. గోల్కొండలోని నానల్‌నగర్, కంచన్‌బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ఎన్‌ఎఫ్‌సీలలో జరిగే మాక్ డ్రిల్‌లో పోలీస్ , ట్రాఫిక్, హెల్త్, రెవెన్యూ, ఫైర్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, రవాణా విభాగాలు పాల్గొంటాయి. వారు వ్యవహరించాల్సిన తీరుపై ఆదేశాలు వెళ్తాయి. రాబోయే కొన్ని రోజుల పాటు సంబంధిత విభాగాల్లో ఎవరూ సెలవులు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భద్రతా దళాలకు సంఘీభావం తెలుపుతూ గురువారం ర్యాలీ నిర్వహిస్తాం’’ అని సీవీ ఆనంద్ వివరించారు.