హైడ్రా, మూసీలతో భయానక వాతావారణాన్ని సృష్టించారు : కేటీఆర్
ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల కారణంగా హైదరాబాద్ లో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Kalasani Durgapraveen Published on 16 Oct 2024 9:29 AM GMTప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల కారణంగా హైదరాబాద్ లో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం ఆనాలోచితంగా, ప్రణాళిక లేకుండా పేదలకు ఎవరూ అండగా లేరన్నట్లుగా దూకుడుగా వారి మీదకు వెళ్తోందన్నారు. మోడీ నోట్ల రద్దు చేసినప్పుడు ఏ విధంగా రకరకాల కారణాలు మారుస్తూ చెప్పారో…కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్దతి అవలంభిస్తోందన్నారు. ఒక రోజు మూసీ సుందరీకరణ అంటారు. ఒక రోజు నల్గొండకు నీళ్లు అంటారు.. ఒక రోజు రూ. లక్షా 50 వేల కోట్లు ఎక్కడివి అంటారు.. ఒక రోజు డీపీఆర్ లేనే లేదంటారు.. ఒక ప్రణాళిక, ఆలోచన లేకుండా ముందుకు వెళ్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వమే 50 ఏళ్ల క్రితమే పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు వాటిని కూలగొడతామని దుందుడుకుగా పోతామంటే కుదరదు. హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ విషయంతో ఒక భయానక వాతావారణాన్ని సృష్టించారన్నారు. హైడ్రాను పెద్ద, పెద్ద బిల్డర్లను బెదిరించేందుకే ఉపయోగిస్తున్నారని మేము నమ్ముతున్నాం.. మూసీ పేరిట ఏ విధంగా లూటీ చేస్తున్నారో ప్రజల దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.
మూసీ కి సంబంధించి 100 శాతం మురుగు నీటి శుద్ది ప్లాంట్లను మేము రూ. 4 వేల కోట్లతో నిర్మించాం అన్నారు. మూసీ శుద్ది మేము చేశాం. దీంతో ఇక నల్గొండ జిల్లాకు వెళ్లే నీళ్లన్ని శుద్ది చేసిన నీళ్లే వెళ్తాయి. దాని కోసం కొత్తగా ఖర్చు చేయాల్సిన పని లేదన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట్ కు నీళ్లు తెచ్చేందుకు 11 వందల కోట్లు ఖర్చు చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం అన్ని తెలిపారు. ఇక రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. నల్గొండకు మంచి నీళ్లు ఇచ్చే ఏర్పాట్లు మేము చేశాం. ఇక నల్గొండ కు నీళ్లు ఇచ్చే ఇష్టం లేదా అంటూ ముఖ్యమంత్రి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదన్నారు. మూసీ సుందరీకరణకు రూ. లక్షా 50 వేల కోట్లు ఎందుకో చెప్పాలన్నారు.
50 ఏళ్ల క్రితం పట్టాలిచ్చిన వారిని హైడ్రా పేరుతో కూల్చివేస్తామంటే కుదరదన్నారు. మీరు చేసిన తప్పునకు పేదలను బలి చేస్తారా? మీరే పట్టాలిచ్చి మీరే కూలగొడుతారా? పేదలకు ఎవరు దిక్కు లేరన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదన్నారు.హైదరాబాద్ లోని పేదలకు బీఆర్ఎస్ రక్షణ కవచంగా ఉంటుందని .. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డుగా మా నాయకులు ఉంటారన్నారు. మేము నిర్మించిన అన్ని ఎస్టీపీలను కూడా మా ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటిస్తాం అన్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాలా డెవలప్ మెంట్ కార్యక్రమం తీసుకున్నాం. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాలను కూడా సందర్శిస్తాం. హైడ్రా పేరుతో ప్రభుత్వం భయపెడుతున్న అన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు మేము భరోసా ఇస్తాం. అదే విధంగా ప్రభుత్వం చట్టాన్ని గౌరవించకపోతే మేము న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ లీగల్ సెల్ కు దాదాపు 450 మంది వచ్చి అండగా ఉండాలని కోరారు. మా పార్టీ లీగల్ సెల్ ను మరింత బలోపేతం చేస్తాం. లీగల్ సెల్ వాళ్లు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారికి అభినందనలు. ఈ ప్రభుత్వం చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ…ప్రజలను కబ్జాదారులు అంటున్న విధానాన్ని ఎండగడతాం. హైడ్రా కారణంగా భయానక వాతావారణం వచ్చిందన్నారు.
మొన్న హైడ్రా పేరుతో కాంగ్రెస్, ఎంఐఎం నాయకులే కొట్టుకున్నారు. ఈ ప్రభుత్వ దిక్కుమాలిన పాలన కారణంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందన్నారు. మాకు అప్పు పుట్టటం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అంటున్నారు. మీ ముఖ్యమంత్రే దివాళా కోరు మాటలు మాట్లాడితే అప్పులు ఎలా పుడుతాయి అన్నారు. నిర్మాణం కాదు విధ్వంసం చేస్తామంటే ఇలాంటి పరిస్థితే ఉంటుందన్నారు. బీజేపీ నాయకుల కన్నా ఎక్కువగా రేవంత్ రెడ్డి దేశ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఆశ్చర్యంగా అనిపించాయి. దేశ రక్షణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉంది. ఏ మూసీ సుందరీకరణ అంటున్నావో…అదే ప్రాంతంలో 12 లక్షల చెట్లు నరికివేసి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఎలా న్యాయం చేస్తారన్నారు. హైదరాబాద్ లో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు మా నాయకులంతా కలసికట్టుగా కదులుతాం అన్నారు. ప్రజలకు ఏమైనా ఇబ్బంది వస్తే మా ప్రజాప్రతినిధులను కలవండన్నారు. లేదంటే తెలంగాణ భవన్ కు రండి. మీకు న్యాయం తప్పకుండా జరగుతుందన్నారు. మా ఫార్మ్ హౌస్ లు చట్ట విరుద్దంగా ఉంటే వాటిని కొట్టేయండి. మా ఫార్మ్ హౌస్ లు కూలగొడితే నీకు రాక్షస ఆనందం వస్తదంటే కూలగొట్టు.. కానీ పేద ప్రజల జోలికి వెళ్లకు.. పేద ప్రజలను ఆగం చేస్తామంటే వారి ఇళ్లు కూలగొడతామంటే ఊరుకోం అన్నారు. రేవంత్ రెడ్డి 10 నెలల్లో 80 వేల కోట్ల అప్పు చేశారు. ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్నారు. మరి అంత డబ్బు ఎక్కడికి పోయిందన్నారు. హైడ్రా, మూసీ పేరుతో సృష్టిస్తున్న భయాకన వాతావారణం నుంచి ప్రజలను రక్షించేందుకు బీఆర్ఎస్ కదులుతోందని.. త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం అన్నారు.