హైదరాబాద్ ఫార్ములా-ఈ రేస్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. దీంతో ఈ కేసులో ఏసీబీ తదుపరి చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసింగ్ కోసం దాదాపు రూ.54.88 కోట్ల ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ. క్యాబినెట్ అనుమతి లేకుండానే నిధులు విడుదల చేయడం.. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఆమోదం లేకుండా విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరపడం.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నిధులు బదిలీ చేయడం వంటి అంశాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో అరవింద్ కుమార్‌ను ఏసీబీ రెండో ఏ2గా పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను నిధులు విడుదల చేశానని అరవింద్ కుమార్ గతంలో ఏసీబీ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అయితే, ఐఏఎస్ అధికారి కావడంతో ఆయనపై కోర్టులో విచారణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. తాజాగా కేంద్రం ఆ అనుమతిని మంజూరు చేయడంతో ఏసీబీ చర్యలు వేగవంతం చేయనుంది