అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం అయ్యింది. మినీ ట్రక్కు కారు ఢీకొన్న ఘటనలో ఈ దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని సుచిత్రలో నివాసం ఉండే శ్రీవెంకట్ (40), తేజస్విని (36) దంపతులు సహా పిల్లలు సిద్ధార్థ (9), మృదా(7)తో కలిసి సెలవుల్లో సరదాగా గడిపేందుకు అమెరికాలోని డల్లాస్‌కు వెళ్లారు. అక్కడి నుంచి అట్లాంటాలోని తమ బంధువుల ఇంటికి కారులో వెళ్లి డల్లాస్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గ్రీన్ కౌంటీ వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ మినీ ట్రక్కు. వీళ్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకొని నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. కారు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది. డీఎన్ఏ నమూనాలు తీసుకొని మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. 2013లో శ్రీవెంకట్, తేజస్వినికి వివాహమైంది. దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.