ఎలాంటి హంగూ ఆర్భాటం లేదు. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సామాన్యుడిలా ట్యాంక్‌బండ్ వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లేకుండా పరిమిత సంఖ్యలో వాహనాలతో సాదాసీదాగా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్‌బండ్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి అక్కడ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
భక్తుల మధ్య చేరిపోయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గణపతి బొప్పా... మోరియా.. అంటూ పెద్ద ఎత్తున భక్తుల నినాదాలు మారుమోగుతున్న వేళ.. ముందస్తు సమాచారం లేకుండా సాదాసీదాగా అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి గారు భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కి అశేషంగా తరలివచ్చిన భక్తులకు అభివాదం చేశారు. అదే క్రమంలో క్రేన్ నంబర్ 4 వద్దకు వెళ్లి నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఉదయం నుంచే శోభాయాత్ర ప్రారంభమై ఒక్కొక్కటిగా గణపతులు ట్యాంక్‌బండ్ తరులుతుండగా, సాయంత్రానికి మహా గణపతి శోభాయాత్ర ఊపందుకుంది. ఆ సమయంలో ఒక సాధారణ వ్యక్తిలా ముఖ్యమంత్రి ఆ మహా జనంలో కలిసిపోయి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో కరచాలనం చేస్తూ ముందుకు నడిచారు. హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ (పీవీ మార్గ్) లో నిరాటంకంగా సాగుతున్న నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లలో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు అదే స్ఫూర్తితో పని చేయాలని చెప్పారు.