తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్ బైపోల్ ఎన్నికల ఫలితాలను నేడు లెక్కించనున్నారు. నెలల పాటు హోరాహోరాగా సాగిన ప్రచారం సాగిన తర్వాత అక్టోబర్ 31వ తేదీన పొలింగ్ జరిగింది. కరీంగనర్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఓట్లు లెక్కించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత.. 8.30 గంటల నుంచి ఈవీఎంలలో ఉన్న ఫలితాలను లెక్కించుతారు. కరోనా నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో 7 టేబుళ్ల చొప్పున ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఆయా అభ్యర్థులకు పడిన ఓట్లను ఏజెంట్ల సమక్షంలో అధికారులు లెక్కిస్తారు.
22 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9.30 గంటలకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక తుది ఫలితం సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. హుజురాబాద్‌లో గెలుపు ఎవరిది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీఆర్‌ఎస్, బీజేపీలు తమ అభ్యర్థుల గెలుపును సవాల్‌గా తీసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకు కృషి చేస్తాయని టీఆర్‌ఎస్ ధీమాతో ఉంది. ఆత్మగౌరవ నినాదంతో టీఆర్‌ఎస్‌ను వీడిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. తనను ప్రజలు తప్పక గెలిపిస్తారనే నమ్మకంతో ఈటల ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుండి పోటీ చేసిన బల్మూరి వెంకట్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో 30 మంది అభ్యర్థులు పోటీ చేశారు. హుజురాబాద్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,36,873 ఉండగా.. 86.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.