కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయడానికి చాలా సమయమే తీసుకుంది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట నర్సింగరావు పేరును తాజాగా ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. అభ్యర్థి ఎంపికపై శుక్రవారం జరిగిన చర్చలో పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే, టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ విద్యార్థి నాయకుడిని అభ్యర్థిగా నిలబెడుతున్న నేపథ్యంలో బల్మూరు వెంకట్ వైపే కాంగ్రెస్ మొగ్గు చూపింది.
రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా బల్మూరు వెంకట్ రెండు సార్లు పని చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ తదితరులతో చర్చించిన అనంతరం వెంకట్ పేరును ఖరారు చేశారు. మిజోరాం తూరియల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. చల్రోసంగ రాల్తేను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టింది.
తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్, టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వెంకట్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.