దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ..రెండ్రోజుల్లో రూ.23 వేల కోట్ల ఒప్పందాలు
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రైజింగ్ బృందం మరోసారి తన సత్తా చాటింది
By - Knakam Karthik |
దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ..రెండ్రోజుల్లో రూ.23 వేల కోట్ల ఒప్పందాలు
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రైజింగ్ బృందం మరోసారి తన సత్తా చాటింది. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిగాయి. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాలలో రూ. 23 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా స్లోవాకియా దేశానికి చెందిన న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ సంస్థ తెలంగాణలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ప్రాజెక్ట్‌కు ముందుకొచ్చింది.
రూ. 6 వేల కోట్ల పెట్టుబడితో ఎస్‌ఎంఆర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇదే సమయంలో రూ. 12,500 కోట్ల పెట్టుబడితో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయాలని మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. పెట్టుబడిదారులతో జరిగిన సమావేశాల్లో తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని అంచనా వేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ జరిగిన భేటీలో… తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలపై టాటా గ్రూప్ ప్రత్యేక ఆసక్తి చూపింది.కీలక భేటీలో హైదరాబాద్‌లో స్టేడియాల అభివృద్ధి, అప్‌గ్రేడేషన్‌కు టాటా గ్రూప్ సిద్ధమని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేందుకు టాటా గ్రూప్ ఆసక్తి వ్యక్తం చూపింది. అలాగే తెలంగాణలో హోటళ్లు, రిసార్ట్స్ ఏర్పాటు, కొత్త మానుఫాక్చరింగ్ యూనిట్ల స్థాపనపై కూడా టాటా గ్రూప్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు.
విజన్–2047 లక్ష్యాల దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు టాటా గ్రూప్‌ను ఆకర్షిస్తున్నాయని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. మూసీ నది పునరుజ్జీవనంలో తమ సంస్థ భాగస్వామ్య అవుతుందన్నారు. హోటళ్లు, రిసార్ట్స్, మానుఫాక్చరింగ్ యూనిట్లపై సీఎం బృందంతో చర్చలు జరిగాయి. తెలంగాణకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తామని టాటా గ్రూప్ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన భేటీలో ఒప్పందాలు జరిగాయి.