తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు
రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజలకు భారీ గుడ్‌న్యూస్ వినిపించింది.
By అంజి Published on 28 Aug 2024 6:19 AM ISTతెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు
రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజలకు భారీ గుడ్‌న్యూస్ వినిపించింది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించి సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు, హెల్త్ కార్డు జారీ చేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వాటిని వేర్వేరుగా జారీ చేయాలని చెప్పారు.
ఈ కార్డుల జారీకి ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలను సేకరించాలన్నారు. అందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారితో పాటు సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి అనుసరించాల్సిన పద్ధతి, హెల్త్ ప్రొఫైల్స్ నమోదుకు చేయాల్సిన వైద్య పరీక్షలు, అందుకోసం వైద్య శిబిరాల నిర్వహణ, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న లాబోరేటరీల వివరాల వంటి అంశాలన్నింటినీ పరిశీలించి కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం చెప్పారు.