తెలంగాణ పర్యాటక శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 1 Dec 2023 10:50 AM GMTహిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే భద్రతా సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్, ఫర్నిచర్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అదే విధంగా మంటలు చెలరేగినప్పుడు కార్యాలయం కింద ఉన్న రెండు ఇన్నోవా కార్లపై అగ్ని కీలలు పడటంతో అవి కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రమాద స్థలాన్ని సందర్శించి , పరిశీలించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఈ అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని కీలకమైన ఫైల్స్ ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందనే కారణం వల్లే ఈ ప్రమాదాన్ని సృష్టించారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి బాగోతం బట్టబయలు కాకుండా కుట్ర చేస్తున్నారని అన్నారు.
ఇటీవల పర్యాటక శాఖ ఎండీ మనోహర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊడిగం చేయడం వల్లే ఎన్నికల కమిషన్ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ ప్రమాదంలో ఆయన ప్రమేయంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హైలెవల్ ఎంక్వయిరీ చేయించాలి.. అప్పుడే వాస్తవాలు బయటకి వస్తాయని అన్నారు.